జ్యేష్ఠ పౌర్ణమి 2026 – లక్ష్మీకటాక్షం, శుభఫలాలు ప్రసాదించే పవిత్ర తిథి
హిందూ సంప్రదాయంలో జ్యేష్ఠ మాస శుక్ల పక్ష పౌర్ణమి అత్యంత పవిత్రమైన తిథిగా భావించబడుతుంది. ఈ రోజు పవిత్ర నదీ స్నానం, దానధర్మాలు, ఉపవాసం, శ్రీమహావిష్ణువు–మహాలక్ష్మీ ఆరాధనలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ పౌర్ణమినే అనేక ప్రాంతాల్లో వట పూర్ణిమగా కూడా ఆచరిస్తారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
మహాలక్ష్మీ–మహావిష్ణువుల ప్రత్యేక ఆరాధన
జ్యేష్ఠ పౌర్ణమి రాత్రి శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం అత్యంత శుభప్రదం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంటిలోకి ప్రవేశించి సిరిసంపదలను ప్రసాదిస్తుందనే విశ్వాసం ఉంది. ఈ సందర్భంగా లక్ష్మీ స్తోత్రం, కనకధార స్తోత్రం, విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల ఐశ్వర్యం, శుభఫలాలు కలుగుతాయని పండితులు చెబుతారు.
ఆర్థిక సమస్యల నివారణకు
లక్ష్మీకటాక్షం కోసం ప్రత్యేక పూజ
జ్యేష్ఠ పౌర్ణమి రోజున 11 గవ్వలకు పసుపు రాసి మహాలక్ష్మీ పాదాల వద్ద ఉంచి పూజించాలి. అనంతరం కుంకుమ లేదా పసుపుతో తిలకం దిద్ది లక్ష్మీ చాలీసా పారాయణం చేయాలి. మరుసటి రోజు ఆ గవ్వలను ఎర్రని వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచితే ఐశ్వర్యం, కీర్తి, ధనవృద్ధి కలుగుతాయని నమ్మకం.
పాయసం నైవేద్యం – కుటుంబ శ్రేయస్సు
ఈ రోజున మహాలక్ష్మీదేవికి పాయసం నైవేద్యంగా సమర్పించి, పెళ్లి కాని ఐదుగురు యువతులకు భోజనం పెట్టి దక్షిణ ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. అనంతరం ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆరోగ్యం, సుఖసంతోషాలు కలుగుతాయని విశ్వాసం.
రుణ విముక్తి కోసం
బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మీదేవిని సువాసన ధూపం, గులాబీ పుష్పాలతో పూజించి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే రుణబాధలు తొలగి, దైవానుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి.
2026లో జ్యేష్ఠ పౌర్ణమి
2026 సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి జూన్ 29, సోమవారం నాడు వస్తుంది. ఈ పవిత్ర దినాన భక్తిశ్రద్ధలతో పూజలు, దానధర్మాలు, జపాలు, దీపారాధనలు నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు శుభఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.
