Tirupati Kodandarama Temple: తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయం శ్రీరామనవమి ఉత్సవాలు 2026 – పూర్తి షెడ్యూల్

 


ఆధ్యాత్మికతకు నిలయమైన శ్రీ కోదండరామస్వామి ఆలయం లో ప్రతి సంవత్సరం జరిగే శ్రీ రామనవమి ఉత్సవాలు భక్తుల మనసులను భక్తిరసంలో ముంచెత్తే మహోత్సవాలు. ఈ సంవత్సరం మార్చి 27 నుండి ఏప్రిల్ 1 వరకు జరుగనున్న ఈ ఉత్సవాలు, శ్రీరాముని జన్మోత్సవం నుండి పట్టాభిషేకం వరకు, అనంతరం తెప్పోత్సవాల వరకు ఘనంగా నిర్వహించబడనున్నాయి.

మార్చి 27 – శ్రీ రామనవమి మహోత్సవం

శ్రీ రామనవమి రోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
ఉదయం మూలవర్లకు అభిషేకం నిర్వహించి, అనంతరం ఉదయం 8 నుండి 9 గంటల వరకు శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా జరుగుతుంది.

మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతుంది.
రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.

మార్చి 28 – శ్రీ సీతారాముల కల్యాణం

ఈ రోజు ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం – శ్రీ సీతారాముల కల్యాణం.
ఉదయం సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.

ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం నుండి ఏనుగుపై ముత్యాల తలంబ్రాలను ఆలయానికి ఘనంగా ఊరేగింపుగా తీసుకువస్తారు.

సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు జరిగే కల్యాణోత్సవంలో గృహస్తులు రూ.1000 చెల్లించి పాల్గొనవచ్చు. పాల్గొనే వారికి ఉత్తరీయం, రవికె మరియు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

మార్చి 29 – శ్రీరామ పట్టాభిషేకం

ఈ రోజు శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.
ఉదయం 8 గంటలకు శ్రీ నరసింహతీర్థం నుండి తీర్థాన్ని ఆలయానికి తీసుకువచ్చి, చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరుగుతుంది.
తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారు మాడ వీధుల్లో ఊరేగింపుగా భక్తులకు దర్శనమిస్తారు.

మార్చి 30 – ఏప్రిల్ 1 : తెప్పోత్సవాలు

శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాలు భక్తులకు దర్శనీయమైన ప్రత్యేక ఉత్సవాలు. ఇవి శ్రీరామచంద్ర పుష్కరిణి లో ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వైభవంగా జరుగుతాయి.

ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
తెప్పోత్సవాల్లో మొదటి రోజు ఐదు చుట్లు, రెండవ రోజు ఏడు చుట్లు, చివరి రోజు తొమ్మిది చుట్లుగా స్వామివారు పుష్కరిణిలో విహరిస్తారు.

Comments